
* రేపు ఆమదాలవలస నియోజకవర్గంలో 'నిజం గెలవాలి'
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - ఆమదాలవలస: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 31న సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చేరుకుంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ తెలిపారు. 'నిజం గెలవాలి'లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనేశ్వరి పర్యటనా వివరాలను వెల్లడించారు. 31న శ్రీకాకుళం నగరానికి చేరుకుంటున్న భువనేశ్వరి రాత్రి అక్కడే బస చేస్తారని తెలిపారు. నవంబరు ఒకటో తేదీ ఉదయం పది గంటలకు మండలంలోని దన్నానపేటలో గొర్లె తిరుపతిరావు కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. అక్కడ్నుంచి సంత కొత్తవలస మీదుగా బూర్జ మండలం తోటాడ చేరుకుని గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం కొల్లివలస, లాబాం, గుత్తావల్లి, జికె వలస మీదుగా పాత నిమ్మతొర్లాడ చేరుకొని ఆకేటి పారయ్య, గొండు ఎర్రయ్య కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. అక్కడ్నుంచి ఆమదాలవలస పట్టణంలోని టిడిపి కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. భోజన విరామం అనంతరం పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.