ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
మంగళవారం మహాశివరాత్రి... జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి.. ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, తలకోన, సురుటుపల్లి, గుడిమల్లం తదితరాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే భక్తుల దర్శనార్ధం అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.
అమృతం కోసం దేవతలు, దానవులు పాలసముద్రాన్ని మదిస్తారు. ఆ సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకుంటాడు. ఆ విష ప్రభావంతో పరమశివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయన్ను మేల్కొలుపుతూ దేవతలు జాగరణ చేస్తారు. దీనినే శివరాత్రిగా పిలుస్తారు. ప్రతి నెలలో వచ్చే మాఘ బహుళ చతుర్ధశిని మాసశివరాత్రిగా నిర్వహిస్తారు. అయితే మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్ధశిని మాత్రమే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజున ఈ ఉత్సవం ఉంటుంది. దేవతల తరపున ఇంద్రుడు శివరాత్రిని నిర్వహిస్తాడని ప్రతీతి. ఇది శివరాత్రి ప్రాశస్త్యం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మాఘ బహుళ చతుర్ధశి మార్చి 1వ తేదీ మంగళవారం రోజు రావడంతో మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు భక్తుల మధ్య తోపులాటలు జరగకూడదనే ముందస్తు జాగ్రత్తతో రాజగోపురం నుంచే క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచితం, ప్రత్యేక టిక్కెట్లు, వీఐపీ క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. లఘు దర్శనం, మహా లఘుదర్శనం చేసుకునేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఆలయాన్ని విద్యుద్ధీపాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. ఈ ఏడాది ఉత్సవాల్లో విద్యుద్ధీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వర్ణముఖిలో స్నాన ఘట్టాలు, ప్రత్యేక స్నాన ఘట్టాలు, మొబైల్ టాయిలెట్లు, చలువు పందిళ్లు కూలింగ్ పెయింట్లు కూడా సిద్ధం చేశారు. గురువారం అర్ధరాత్రి రెండు గంటల నుంచి శివరాత్రి దర్శనం ప్రారంభమవుతుంది. మూడు గంటలకు లింగోద్భవ దర్శనం ఉంటుంది. లింగోద్భవ దర్శనంలో భక్తులకు మహాలఘు దర్శనం కల్పస్తున్న ఆలయాధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు, మంచినీరు, పాలు సిద్ధం చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శివరాత్రి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం గమనార్హం.










