నేడే 3వ విడత వైఎస్‌ఆర్ కాపు నేస్తం
జిల్లాకు చెందిన 6,565 మందికి రూ.9.86 కోట్లు లబ్ది : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
రాష్ట్రంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజిక కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల వయసు మధ్యగల అర్హత గల మహిళలకు 3వ విడత వైఎస్‌ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15,000లు చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాపునేస్తం ద్వారా లబ్దిదారులకు 5సంవత్సరాలకు గానూ మొత్తం రూ.75,000లు ఆర్ధిక లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈపథకానికి సంబంధించి జిల్లాస్థాయి కార్యక్రమం ఈనెల 29న శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర సాంస్కతిక యువజన సర్వీసులు, క్రీడల శాఖామాత్యులు ఆర్‌కె.రోజా, జెడ్‌పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొంటారని తెలిపారు. 45 నుండి 60 సంవత్సరాల వయసు మధ్య గల మహిళల కుటుంబ నెలసరి ఆదాయం గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలు మించని వారు, ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కులధవీకరణ పత్రం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 6565 మంది మహిళలకు రూ.9.86 కోట్లు లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నియోజకవార్గాల వారీగా చిత్తూరుకు చెందిన 846 మందికి రూ.1.27 కోట్లు, జి.డి.నెల్లూరుకు చెందిన 844 మందికి రూ.1.27 కోట్లు, కుప్పంకు చెందిన 750 మందికి రూ.1.13 కోట్లు, నగరికి చెందిన 255 మందికి రూ.0.38 కోట్లు, పలమనేరుకు చెందిన 1190 మందికి రూ.1.79 కోట్లు, పుంగనూరుకు చెందిన 1577 మందికి రూ.2.37 కోట్లు, పూతలపట్టు కు చెందిన 1103 మందికి రూ.1.65 కోట్లు మంది లబ్ది పొందనున్నారని తెలిపారు. జిల్లాలో మొదటి విడత ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరములో 7 నియోజకవర్గాలలో 6116 మందికి రూ.9.18కోట్లు, 2021-22 సంవత్సరంలో 6656 మందికి రూ.9.99 కోట్లు లబ్ది చేకూర్చడం జరుగుతుందని పేర్కొన్నారు.










