Jan 31,2021 00:05

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

నాతవరం : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. నాతవరంలో శనివారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధిస్తారని చెప్పారు. వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునేలా టిడిపి మద్దతుదారులు కృషి చేయాలన్నారు. జిల్లేడుపూడి పంచాయతీకి చెందిన 50 మంది వైసిపి కార్యకర్తలు ఈ సందర్భంగా టీడీపీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కరక సత్యనారాయణ, నందిపల్లి వెంకటరమణ, లాలం అబ్బారావు, పారుల్లి కొండబాబు, కూండ్రపు అప్పలనాయుడు పాల్గొన్నారు.