నారాయణస్వామి × జ్ఞానేంద్రరెడ్డి
శృతిమించుతున్న విభేదాలు
మండల కమిటీల నియామకంలో బహిర్గతం
జీడీనెల్లూరు నియోజకవర్గంలో 'గ్రూపుల'హోరు
ప్రజాశక్తి - వెదురుకుప్పం
అధికార పార్టీలో ఆధిపత్యపోరు ఎక్కువయ్యింది.. ఇటీవల కాలంలో పెద్దిరెడ్డి × ఆర్‌కె రోజా మధ్య విభేదాలు పత్రికలకెక్కాయి. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోనూ ఎంఎల్‌ఎకు వ్యతిరేక గ్రూపు నడుస్తోంది.. ప్రస్తుతం జీడీనెల్లూరు నియోజకవర్గంలో విభేదాలు శృతిమించుతున్నాయి. తాజాగా మండల కమిటీల నియామకంలో ప్రభుత్వ (ఎన్‌ఆర్‌ఐ) సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణస్వామి మధ్య అంతర్గతంగా ఉన్న రగడ బహిర్గమయ్యింది.
ఇద్దరూ వైసిపి నేతలే. అయితే ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి. గతంలో నారాయణస్వామి మూడుసార్లు ఎంఎల్‌ఎగా పనిచేసిన సమయంలో పెద్దగా విరోధులు లేరు. డిప్యూటీ సిఎం అయ్యాక తరచూ వార్తల్లో ఉంటున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం, పెనుమూరు, కార్వేటినగరం, పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, గంగాధరనెల్లూరు మండలాలు ఉన్నాయి. తాజాగా మండల కమిటీల అధ్యక్షుల నియామకం జరిగింది. అయితే డిప్యూటీ సిఎం పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశమిచ్చారు.
పెనుమూరు మండలంలో మహాసముద్రం కుటుంబం వారు మండల పార్టీ అధ్యక్ష పదవిలో ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ కుటుంబాన్ని పక్కనపెట్టి కామసాని విజయకుమార్‌ను కొత్తగా ప్రకటించారు. అతను డిప్యూటీ సిఎం అనుచరుడుగా ముద్రవేసుకున్నారు. జ్ఞానేంద్రరెడ్డి అనుచరుడైన దేవరాజురెడ్డి, డిప్యూటీ సిఎం అనుచరుడు ఎఎంసి మాజీ ఛైర్మన్ కండిగ మధురరెడ్డి మధ్య మాటల యుద్ధం ఓ రేంజిలో నడుస్తోంది. ఈ సంభాషన అంతా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జులై 22న నియోజకవర్గంలో మండల అధ్యక్షులను ప్రకటించిన కళత్తూరు నారాయణస్వామి తిరిగి పునరాలోచించేది లేదని స్పష్టం చేశారు. జీడీనెల్లూరు మండలాధ్యక్షుడిగా పూర్ణచంద్రారెడ్డి, ఎస్‌ఆర్‌పురం మండల అధ్యక్షునిగా మణి, వెదురుకుప్పం పద్మనాభరెడ్డి, పెనుమూరు కామసాని విజయకుమార్, కార్వేటినగరం శేఖర్‌రాజు, పాలసముద్రం తులసి యాదవ్‌ను నియమించారు. జ్ఞానేంద్రరెడ్డి సొంతూరైన పెనుమూరులో సమీప బంధువైన మహాసముద్రం సురేష్‌రెడ్డిని కాదని కామసాని విజరుకుమార్‌రెడ్డిని నియమించడంతో గ్రూపుల పోరుకు తెరలేచింది. గతంలో సర్పంచి ఎన్నికల్లో మొదలైన విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. సిడిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు వేల్కూరు బాబురెడ్డి డిప్యూటీ సిఎంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన 'గడప గడపకూ ప్రభుత్వం' కార్యక్రమంలోనూ స్వపక్షాలే ప్రశ్నించడం గమనార్హం. గతంలో రెండు మండలాల్లో మొదలైన గ్రూపు రాజకీయం ప్రస్తుతం నియోజకవర్గానికి వ్యాపించింది.










