నారాయణకు యుటిఎఫ్ నేతల నివాళి
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్:
ఆకస్మికంగా మృతిచెందిన యుటిఎఫ్ నాయకులు నాగటి నారాయణకు స్థానిక యుటిఎఫ్ కార్యాయలంలో యుటిఎఫ్ నాయకులు నివాళ్ళు అర్పించారు. ఉద్యమనేత, ఫోరాట యోదుడిగా యుటిఎఫ్ అభివృద్ధి కోసం కృషిచేసిన నారాయణ మృతి బాధాకరమని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జివి.రమణ తెలిపారు. దాచూరి రామిరెడ్డి, అప్పారి వెంకటస్వామి వారసుడిగా నేటితరం నాయకుడిగా ఉక్కు క్రమశిక్షణతో సంఘాన్ని నడిపించిన నాయకుడు నాగటి నారాయణ అని కొనియాడారు. ప్రతిఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ అనర్గళంగా మాట్లాడుతూ అందర్ని ఆకట్టుకొనేవారని అన్నారు. అప్రెంటిస్ విధానం రద్దు కోసం జరిగిన 13రోజుల సమ్మెకు అన్ని సంఘాల తరపున నాయకత్వం వహించారని ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యచరణ సమితి ఛైర్మెన్‌గా అనేక పదవులు బాధ్యతాయుతంగా నిర్వహించి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన మృతి ఉపాధ్యాయ లోకానికి తీరనిలోటని అభివర్ణించారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.సుధాకర్‌రెడ్డి, జీవి రమణ, గౌరవాధ్యక్షులు సోమశేఖర్ నాయుడు, సహఅధ్యక్షులు రెహానా బేగం, జిల్లా కార్యదర్శులు రెడ్డెప్ప నాయుడు, దక్షిణామూర్తి, ఎస్‌పి.బాషా, బిర్లా నాయుడు, పార్థసారథి, రమేష్ నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.
నారాయణ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి
సాధారణ కుటుంబంలో జన్మించిన నాగేటి నారాయణ ఉపాధ్యాయ వత్తిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మన్నలను పొందారని, అంతేకాకుండా ఉపాధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోదుడని ఆయన మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. నారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఉపాధ్యాయ ఉద్యమానికి విశేషసేవలు అందించారని అలాంటి గొప్పవ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.










