ప్రజాశక్తి-నెల్లూరు :మాజీ మంత్రి నారాయణను నమ్మి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు మోసపోవద్దని, ఎన్నికలు అయిన వెంటనే ఆయన మాయం అయిపోతారంటూ నగర ఎంఎల్‌ఎ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గురువారం నగర ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వైసిపి సానుభూతి పరుల ఓట్లను నారాయణ తన కళాశాల సిబ్బందిచే తొలగింపజేస్తున్నారని ఆరోపించారు. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు చేయించి కొంత మంది చనిపోయినట్లు, కొంత మంది చిరునామా మారినట్లు ధరఖాస్తులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై నవాబుపేట పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి నేత నారాయణ దొంగ ఓట్లను నమోదు చేయిస్తూ తమపైనే బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.










