ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోనినారాయణ జూనియర్ కళాశాల బార్సు హాస్టల్ నుంచి ఓ విద్యార్థి కనపించకుండా పోవడంతో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చంద్ర కళాశాల యాజమాన్యం పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలే బయటికి పారిపోయాడన్నారు. అయితే విద్యార్థి కనిపించకుండా పోయినా వెతకకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థి తప్పిపోవడానికి కారకులైన నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వామి, నాయకులు సిద్ధు, శివ, వినోద్, చంద్ర, వంశీ, హరి, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు










