ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం రైతులకు నాణ్యమైన విత్తనకాయలు పంపిణీ చేయాలని ఎంపిపి దాసరి సునీత సూచించారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ మండలానికి కె6 రకం 2300 క్వింటాళ్లు, కె-1812 (లేపాక్షి )50 క్వింటాళ్లు కేటాయించినట్లు తెపారు. వీటి ధర రూ.9300 కాగా 40శాతం సబ్సిడీ పోతే రైతు రూ.5580 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి రైతుకూ గరిష్టంగా మూడు బ్యాగులు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాల్లో విత్తన కాయలను నిల్వ చేయనున్నట్లు తెలిపారు. కావున రైతు భరోసా సిబ్బంది ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను కలుపుకుని విత్తనకాయల నాణ్యతను పరిశీలించిన తర్వాతే రైతులకు పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఎడిఎ వెంకటరాముడు మాట్లాడుతూ సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విత్తనకాయలతోపాటు పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీతో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే డ్రోన్ స్ప్రేయర్లకు సంబంధించి వ్యవసాయ డిప్లొమా విద్య, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు పైలట్ శిక్షణ గుంటూరు లాం ఫారంలో ఇప్పించి పాసుపోర్టు కూడా అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాలని కోరారు. పశుసంవర్ధక శాఖ ఎడిఎ రత్నకుమార్ మాట్లాడుతూ మొబైల్ అంబులెన్సు 1962 సేవలను రైతులు వినియోగించుకోవాలన్నారు. మార్కుఫెడ్ మేనేజర్ పిన్నేశ్వరి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులను సరఫరా చేస్తామన్నారు. అలాగే మద్దతు ధర రూ.1,962తో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎఒ హరిత, మండల వ్యవసాయ అధికారి శ్యాం సుందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎఇ ప్రతాప్, రైతు భరోసా కేంద్రాల ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి దాసరి సునీత










