ప్రజాశక్తి-అనంతపురం ఖరీఫ్ సాగుకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కలెక్టర్ గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈఏడాదిని రాష్ట్ర ప్రభుత్వం మిల్లట్స్ అఫ్ ఇయర్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే వైఎస్‌ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ, పంట రుణాలు, పంటల బీమా, యంత్ర సేవాపథకం, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర పథకాలను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పక్కాగా ఈ-పంట నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వానికి పక్కాగా నివేదిక అందించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కేతన్‌గార్గ్, జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమి










