Sep 22,2022 21:58

నాణ్యమైన సేవలందించాలి
ప్రతి నివాసాన్ని పరిశీలించండి : కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వార్డు సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉదయం కమిషనర్‌ నగరపాలక 22వ వార్డు సచివాలయం పరిధిలో తేనబండ, గంగాకాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్న తీరును తనిఖీ చేసి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆన్‌లైన్‌ హాజరు నమోదు తనిఖీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, హౌసింగ్‌, పన్నుల వసూళ్లు, నీటి సరఫరా, స్పందన ఫిర్యాదులు తదితర అంశాలపై నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులు నేపథ్యంలో వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు వారివారి క్లస్టర్‌ పరిధిలో ప్రతి నివాసాన్ని పరిశీలించాలని, డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించాలన్నారు. హౌసింగ్‌ సంబంధించి సరైన రిపోర్ట్స్‌ సమర్పించకపోవడం, ట్యాంకుల శుభ్రత పర్యవేక్షించకపోవడంపై వార్డు అమినిటీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్‌ గంగాకాలనీలో ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేగంగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్‌ హైవే రోడ్‌ లోని హోటల్‌ కింగ్‌ వంట గదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారపదార్థాల నాణ్యత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, స్థానిక కార్పొరేటర్‌ గంగా, డీఈ రమణ, హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, ఏఈ శ్రీలత, ఇతర అధికారులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.