Apr 21,2023 21:41

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

          ప్రజాశక్తి-అనంతపురం    వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.600 కోట్లతో వివిధ పనుల చేపట్టి అనంతపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని లక్ష్మీనగర్‌లో రూ.25 కోట్ల ప్రత్యేక నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎంపి తలారి రంగయ్యతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రత్యేక చొరవతో నగరానికి రూ.25 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో డివిజన్లలో రోడ్లు, బ్రిడ్జిలు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గుత్తి రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించామన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులతోపాటు జనరల్‌ ఫండ్స్‌తో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామన్నారు. పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు నాలుగు లైన్ల రహదారి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. తాము టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తుంటే టిడిపి నాయకులు మాత్రం సెల్ఫీలంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నగరంలో ఇప్పటి వరకూ 23 వేల మందికి ఇంటి పట్టాలు అందజేశామని, వాటిలో ఇళ్ల నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయన్నారు. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు టిడ్కో పేరుతో టిడిపి నాయకులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి భూమిపూజకు మాత్రమే పరిమితం చేశారన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తే.. ఇప్పుడు టిడిపి నాయకులు సెల్ఫీలు తీసుకుంటూ తమ హయాంలో నిర్మించామని చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో నగర పాలకవర్గం సహకారంతో రూ.600కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలో ఇంత పెద్ద ఎత్తున పనులు చేయడం చిన్న విషయం కాదన్నారు. ఈకార్యక్రమంలో మేయర్‌ మహమ్మద్‌ వసీం, కమిషనర్‌ రమణారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.