Apr 08,2023 22:26

దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడుతున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు      పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పట్టణ కమిటీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి నాల్గవ రోజుకు చేరాయి. శనివారం సిపిఎం అనుబంధ ప్రజా సంఘం ఐద్వా నాయకులు మద్దతు తెలుపుతూ దీక్షల్లో పాల్గొన్నారు. వారి దీక్షలకు సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు వీరభద్ర స్వామి, గోపినాథ్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ ప్రజా సంఘం అధ్యక్షుడు ఆలం నవాజ్‌, కార్యదర్శి ఎం.మహేంద్ర, నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. శిబిరం వద్దకు వెళ్లి దీక్షలు చేస్తున్న వారికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం నాయకులు ప్రజా సమస్యలపై రిలే దీక్షలు చేపట్టి నాలుగు రోజులు అయినా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించక పోవడం చూస్తే ప్రజల సంక్షేమం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. మా భవిష్యత్తు నీవే జగన్‌ అనే కార్యక్రమంతో ఇంటింటా తిరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డికి ప్రజా సమస్యలపై చేస్తున్న రిలే దీక్షల శిబిరం కనపడలేదా అని ప్రశ్నించారు. దీక్షలో ఐద్వా మహిళా సంఘం కార్యదర్శి రంగమ్మ, నాయకురాల్లు లక్ష్మీబాయి, లలిత, కుమారి, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రేణుక, ఉషారాణి, కీర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు రాము నాయక్‌, మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.