సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలన్
ప్రజాశక్తి - పాలకోడేరు
భీమవరం తాలూ కాలో రైస్‌మిల్లు ఉద్యమ విస్తరణలో యాతం నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్ కొని యాడారు. శృంగవృక్షం జయలక్ష్మి రైస్‌మిల్లు బుధవారం నాగేశ్వరరావు సంతాప సభ నిర్వహిచారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ 1962లో భీమవరం తాలూకా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడంలో నాగేశ్వరరావు కీలకపాత్ర పోషించారన్నారు. యాజమాన్యాలు సంఘం పెట్టుకోవడానికి అనేక ఆటంకాలు కలిగించినా కార్మికులందరినీ ఐక్యంగా నిలబెట్టి పోరాటాలు నిర్వహించారన్నారు. కనీస వేతనాలు, నూతన వేతన ఒప్పందలా కోసం అనేక సందర్భాల్లో జరిగిన పోరాటాల్లో పోలీస్ కాల్పుల్లో కూడా నాగేశ్వరరావు ధైర్యంగా నిలబడ్డారన్నారు. 74 రోజుల సమ్మెలో యాజమాన్యాలు యూనియన్ విచ్ఛిన్నం చేయడం కోసం చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టడంలో నాగేశ్వరరావు మంచి కృషి చేశారని తెలిపారు. సాధించుకున్న హక్కులు, చట్టాలు నాగేశ్వరరావు స్ఫూర్తితో పోరాడి నిలబెట్టుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికుల ందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సభలో భీమవరం తాలూకా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కలిపింది సత్యనారా యణ, బి.వాసుదేవరావు, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొత్తల సత్తిబాబు బద్రి రాము, అప్పారావు, కాడల్ రమణరాజు, సుధాకర్ పాల్గొన్నారు.










