
* మృతుడు ప్రకాశం జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థి
ప్రజాశక్తి - బూర్జ: బూర్జ మండలం ఏటొడ్డుపర్త (వై.పర్త) గ్రామానికి సమీపంలోని నాగావళి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ఆదివారం మృతి చెందాడు. మృతుడు కల్లూరి వెంకట నారాయణ ప్రకాశం జిల్లా పి.సి పల్లి మండలం మర్రికుంటపల్లికి చెందిన వాడు. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... వెంకట నారాయణ విజయవాడలోని కెఎల్ యూనివర్సిటీలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బూర్జ ఎంపిపి కర్నేన దీప కుమారుడు హేమంత్ అక్కడే విద్యనభ్యసిస్తున్నాడు. దసరా సెలవులకు వెంకట నారాయణ హేమంత్ స్వగ్రామం లక్కుపురానికి ఈనెల 17వ తేదీన వచ్చాడు. నాగావళి నదిలో స్నానం కోసం ఆదివారం వె.ౖపర్తకు వెళ్లారు. స్నానం చేస్తుండగా వెంకట నారాయణ గల్లంతయ్యాడు. దీంతో స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి విషయాన్ని చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో గాలింపు ప్రక్రియ చేపట్టగా మధ్యాహ్నం మూడు గంటల సమయానికి మృతదేహం లభ్యమైంది. మృతుని తల్లిదండ్రులు జయమ్మ, వెంకటేష్‌కు విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పారు. వారు అక్కడ్నుంచి బయలుదేరడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎఎస్‌ఐ కె.వి రమణ తెలిపారు.