Jul 25,2022 22:40

నాడు- నేడు ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్లో మార్పు
సమన్వయంతో పనిచేయండి: కలెక్టర్‌
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ :
పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు విద్యాశాఖ, సంబంధిత ఇంజినీరింగ్‌ ఏజెన్సీలు సమన్వయముతో సమిష్టిగా పనిచేయాలని జిల్లాకలెక్టర్‌ యం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ జిల్లా సమగ్రశిక్షా కో-ఆర్డినేటర్‌ వెంకట్రమణారెడ్డి, డిఈఓ పురుషోత్తం, ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్‌ఈ వెంకట్రమణలతో కలసి ఎంపిడిఓలు, ఎంఈఓలు, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌ బి, ఇరిగేషన్‌, ఈడబ్ల్యుఐఈసిలకు చెందిన డీఈలు, ఏఈలతో నాడు-నేడు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నాడు-నేడు పనుల పురోగతిపై తరచూ సమీక్షించడం జరుగుతున్నదన్నారు. మొదటి విడతలో చేపట్టిన నాడు-నేడు పనులతో పాఠశాలలో సురక్షితమైన తాగునీరుతో పాటు పాఠశాల భవనాలు, మరుగుదొడ్ల రూపురేఖలు మారాయని, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంను పాఠశాలలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈకార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కషి చేయాలన్నారు. రెండవ విడతలో ఎంపిక కాబడ్డ పాఠశాలలలో 751కి పరిపాలనా అనుమతులు ఇవ్వగా ఇంకనూ 76పాఠశాలలు రివాల్వింగ్‌ ఫండ్‌ కొరకు అప్లై చేయవలసి ఉన్నదన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఎంపిక కాబడ్డ పాఠశాలలు రివాల్వింగ్‌ ఫండ్‌ కొరకు అఫ్‌లోడ్‌ ప్రక్రియను ఈ శుక్రవారం లోపు వంద శాతంపూర్తి చేయాలన్నారు. ఈనెల 31వ తేదీలోపు అన్ని మండలాల్లో వందశాతం జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాలికను సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. ఈ అంశంనకు సంబంధించి విలీన పాఠశాలల ఎంఈఓలు, ప్రధానాపోధ్యాయులు సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పి సిఈఓ, ఇతర సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.