Aug 01,2022 21:38

నాడు-నేడు పనులు వేగవంతం : కలెక్టర్‌
జగనన్న గోరుముద్దలో నాణ్యతలు పాటించాలి
బయోమెట్రిక్‌ హాజరు శాతం పెంచాలి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
నాణ్యమైన విద్యను అందించేందుకు చక్కటి వసతి కూడా ఉండాలని, పాఠశాల పరిసరాలను చక్కగా తీర్చిదిద్దేందుకు నాడు-నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని, జగనన్న విద్యాకానుకలను వెంటనే అందించాలని, గోరుముద్ద కార్యక్రమంలో నాణ్యతలను పాటించాలని బయోమెట్రిక్‌ హాజరు 100శాతం ఉండేలా చూడాలన్నారు. జిల్లాకలెక్టర్‌ సోమవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్‌ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, మండల ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1094 పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారని, ఇప్పటివరకు 1029 పాఠశాలలలో సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని, మిగతా కార్యక్రమాలు వెంటనే పూర్తిచేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, విద్యాకమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో నాణ్యత గల ఆహారం అందించేలా చూడాలని ఆదేశించారు. విద్యా కానుకలను వెంటనే పాఠశాలలకు అందజేయాలని ఇప్పటివరకు 123 పాఠశాలలకు మాత్రమే పూర్తిస్థాయిలో అందించారని 2,352 పాఠశాలలకు వెంటనే అందించే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. జిల్లాలో బయోమెట్రిక్‌ హాజరు 98శాతం ఉందని, హాజరు శాతం 100 ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డీఈవో పురుషోత్తం, మెప్మా పీడీ రాధమ్మ, ఏపీసి వెంకటరమణారెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.