Nov 21,2022 22:05

నాడు- నేడు పనులు వేగవంతం చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లాలో రెండో విడత నాడు- నేడు పనులను వేగవంతం చేయాలని రివాల్వింగ్‌ ఫండ్‌ ఎప్పటికప్పుడు ఖర్చుపెట్టాలని, అన్ని కాంపోనెంట్లు పనులు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఏపీసి వెంకటరమణారెడ్డి, డీఈవో విజయేందర్‌రావుతో కలిసి ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇంజనీరింగ్‌ సిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నాడు- నేడు ద్వారా 1,213 పాఠశాలలలో వివిధ రకాల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 246 పాఠశాలలో 80శాతం కన్నా తక్కువ పనులు జరిగాయని, పనులు వేగంగా చేయాలన్నారు. ఈసందర్భంగా తక్కువ పనులు చేస్తున్న పాఠశాలలను సంబంధిత అధికారులతో అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా సిమెంట్‌ రావడం జరుగుతుందని, సిమెంటుకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్‌ చేయాలన్నారు. ఆ విధంగా చేసినప్పుడే రానున్న కాలంలో కంపెనీలు సిమెంట్‌ పంపడం జరుగుతుందని తెలిపారు. లేదంటే తిరిగి ఆలస్యం అవుతుందని ఆ విధంగా జరగకూడదని సూచించారు. 12 మండలాలు 60శాతం కన్నా తక్కువ పనులు నిర్వహిస్తున్నారని అందుకు సంబంధించి పనులను వేగవంతం చేస్తూ బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్‌ చేసి రివాల్వింగ్‌ ఫండ్‌ వచ్చేలా చూడాలన్నారు. దీంతోపాటు ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తేనే తిరిగి రివాల్వింగ్‌ ఫండ్‌ వస్తుందన్నారు.