
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్, సమగ్ర శిక్ష జిల్లా చైర్మన్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యాన జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.32 కోట్ల నాడు-నేడు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులు పూర్తి చేసిన వారికి బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 30 మండలాలకు గానూ నాడు-నేడు రెండో దశలో 1056 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. పురోగతిలో వెనుకబడిన రణస్థలం, సోంపేట, జలుమూరు, పొందూరు మండలాల ఎంఇఒ, అసిస్టెంట్ ఇంజినీర్లను పనుల జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమీక్షకు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. పాఠశాలల పనులకు సిమెంట్, ఇసుక కొరత లేదన్నారు. బిల్లులు సమర్పించే కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్లలో సైతం ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేశారు. పనులు చేపట్టే ఏజెన్సీలకు ఈ విషయం స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.