May 13,2023 22:07

పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమి

ప్రజాశక్తి - బుక్కరాయసముద్రం : నాడు- నేడు కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను త్వరితతగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎమ్‌. గౌతమి అధికారులను ఆదేశించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిల్వచేసిన జగనన్న విద్యా కానుక కిట్లను ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలు పున: ప్రారంభించడానికి మునుపే నాడు- నేడు కింద చేపట్టిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు, గ్రీన్‌ చాక్‌ బోర్డు, నేలపై టైల్స్‌ వేయడం, రంగులు వేయడంలాంటి పనులు చేపట్టామని, వర్షం కురిస్తే పాఠశాలల లోపు నీరు నిలిచేదని అందుకోసం నాలుగు అడుగుల మేర ఎత్తు కూడా పెంచామని ఈసందర్భంగా ఎంఇఒ కలెక్టర్‌ కు వివరించారు. అనంతరం విద్యార్థులకు పంపిణీ చేయనున్న యానిఫాం మెటీరియల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఆ మెటీరియల్‌ విద్యార్థులు పాఠశాలల్లో చేరిన తర్వాత వారి తల్లిదండ్రులకు అందిస్తారని,వారు వారి పిల్లల సైజుకు అనుగుణంగా వాటిని కుట్టించాల్సి ఉంటుందని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని డిఇఒ కలెక్టర్‌కు తెలిపారు. పాఠశాల తనిఖీలకు వెళ్లే అధికారులకు అందుకు సంబంధించిన ఒక చెక్‌ లిస్ట్‌ ని తయారు చేసి ఇవ్వాలని, వారు పరిశీలించిన అంశాలను అందులో నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని 57 పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు సరఫరా చేయవలసిన పాఠ్య, అభ్యసన, నోటు పుస్తకాలను కలెక్టర్‌ పరిశీలించారు. పాఠ్యపుస్తకంలో ముద్రించి ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రికార్డు కాబడి ఉన్న అంశాన్ని పరిశీలించారు. సకాలంలో పుస్తకాలన్నింటినీ సరఫరా చేయాలని ఈసందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ కృష్ణయ్య, మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర్‌ రెడ్డి, ఎంఇఒ గురు ప్రసాద్‌, హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఎ ఏపీవో నారాయణస్వామి, ఎఎస్‌ఒ మారుతి, భాస్కర్‌, ఇతరఅధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలపై అవగాహన కల్పించండి : బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎమ్‌. గౌతమి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. హౌసింగ్‌ డేలో భాగంగా శనివారం ఉదయం బుక్కరాయసముద్రం మండలంలో అడ్డదిబ్బ, సిద్ధరాంపురం రోడ్డు లేఅవుట్లలో చేపడుతున్న జగనన్న గృహ నిర్మాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలలో బేస్‌మెంట్‌ స్థాయిలో నిలిచి ఉన్న నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. బిబిఎల్‌ నుంచి బిఎల్‌ స్థాయికి, రూఫ్‌ లెవెల్‌ నుంచి ఆర్సీ స్థాయికివచ్చేలా ఇళ్ల నిర్మాణంలో వెంటనే పురోగతి చూపించాలని, స్టేజి అప్డేట్లు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. లేఅవుట్లలో పూర్తిచేసిన గృహాలను ఇతర లబ్ధిదారులకు చూపించి వారు కూడా వివిధ దశలలో ఉన్న తమ గృహాలను పూర్తిచేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పూర్తయిన గృహాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రస్తుతం అప్లోడ్‌ చేసిన బిల్లులకు వెంటనే నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని కేటాయించిన లక్ష్యాలకు చేరుకోవాలన్నారు. ఇంకా గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ కేశవ నాయుడు, డిఇ శ్రీమన్నారాయణ, ఎఇ రాజశేఖర్‌ రెడ్డి, ఎపిఎం మద్దిలేటి, ఇతర అధికారులు పాల్గొన్నారు.