Aug 21,2023 23:03

నాడు- నేడు పనులు పరిశీలించిన కలెక్టర్‌
ప్రజాశక్తి- సోమల:
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. సోమవారం సదుం మండలంలో పర్యటించి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు -నేడు కింద జరుగుతున్న అదనపు తరగతుల నిర్మాణపనులను పరిశీలించారు. 21 తరగతి గదులు మంజూరు కాగా అందులో 14 తరగతి గదులు స్లాబ్‌స్థాయి దాటిందని, తరగతి గదుల నిర్మాణ పనులు వేగంగా చేపట్టడం జరుగుతున్నదని సమగ్రశిక్ష ఏపిసి వెంకట రమణారెడ్డి కలెక్టర్‌ కు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైన జూనియర్‌ కాలేజీ, హాస్టల్‌ భవన నిర్మాణం కొరకు కలెక్టర్‌ స్థలపరిశీలన చేశారు. ఈపర్యటనలో జిల్లా కలెక్టర్‌ వెంట సమగ్ర శిక్ష ఏపిసితో పాటు సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ డిడిలు రాజ్యలక్ష్మి, రబ్బానీ బాషా, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, మంత్రి పిఏ తుకారాం, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమ శేఖర్‌రెడ్డి, బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసుల రెడ్డి, వైస్‌ ఎంపీపీ అమరావతి పుత్రాజు, ఎంఈఓ శ్రీరాములు, అధికారులు పాల్గొన్నారు.