Oct 10,2022 22:33

నాడు- నేడు పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం, గ్రామవార్డు సచివాలయాలు, భవనాలు, గడపగడపకు మన ప్రభుత్వం, గహనిర్మాణాలు, పాఠశాలలలో నాడు- నేడు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆమేరకు పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఇంజనీర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వివిధస్థాయిలలో నాడు-నేడు పనులు జరుగుతున్నాయని, జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400కోట్లు మంజూరు కాగా రూ.65కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందన్నారు. 15 శాతం మాత్రమే ఖర్చు చేశారని మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని వేగంగా పనులు చేయాలని ఆదేశించారు. అలాగే జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్‌ చేయాలని, ఇంకా ఎంవోయూలు ఏవైనా పెండింగ్‌ ఉంటే హెడ్మాస్టర్లు అప్లోడ్‌ చేయాలని లేకుంటే రివాల్వింగ్‌ పండు రాదని తెలిపారు. అదనపు క్లాస్‌రూమ్‌ల విషయంలో ఇంకా అప్లోడ్‌ చేయాల్సినవి ఉన్నాయని వాటిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు రివాల్వింగ్‌ ఫండ్‌ 118స్కూల్స్‌కు రావడం జరిగిందని, మరో 41 స్కూల్స్‌కి పెండింగ్‌లో ఉందన్నారు. అలాగే మైనర్‌ రిపేర్లు, ఫ్లోరింగ్‌ అదనపు క్లాస్‌రూమ్‌లో టాయిలెట్స్‌ నిర్మాణాలు చేస్తున్న పనులు ఆపకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల మేరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలలను తీర్చిదిద్దాలని ఒకే కాంపౌండ్‌లో ఎలిమెంటరీ స్కూల్‌, హైస్కూల్‌ ఉంటే వాటికి కావాల్సిన సౌకర్యాలను సంయుక్తంగా చేసుకోవచ్చునని, ఇద్దరు హెడ్మాస్టర్లు ఆవిధంగా కోఆర్డినేట్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీసి వెంకటరమణారెడ్డి, డీఈవో పురుషోత్తం, ఎస్‌ఇఆర్‌ డబ్ల్యుఎస్‌ జ్యోతి పాల్గొన్నారు.