అనంతపురం కలెక్టరేట్ : జూన్ 12న నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు మైనర్ మరమ్మతులను పూర్తి చేయాలని ఎంఈవోలను కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పలు కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆమె నాడు-నేడు పనులపై ఎంఇఒలతో మాట్లాడారు. సెలవు దినాల్లో కూడా అధికారులు నాడు-నేడు పనుల పురుగోతిపై దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంటగదులు, విద్యుత్ తదితర పనులను పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభం అయ్యే రోజుకు చిన్నచిన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు. మే 25న నియోజక వర్గాల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యున్నత మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేసే 'జగనన్న అనిముత్యాలు' కార్యక్రమం నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నియోజక వర్గ స్థాయిలో టాపర్ల ఎంపికలో ఎటువంటి పొరబాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రారంభమవగానే విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నివేదికల ప్రకారం జిల్లాలో 137 మంది డ్రాపవుట్లు ఉన్నాయని, తిరిగి ఆ విద్యార్థులను పాఠశాలలో చేరేలా చూడాలన్నారు. పదవతరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గాయత్రీదేవి, డీఈవో సాయిరాం, సీపీవో ప్రేమ్‌చంద్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జెడ్పీ సీఈవో భాస్కర్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హసాన్ బాషా, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డిఎస్‌ఒ శోభారాణి పాల్గొన్నారు.










