నాడు- నేడు పనుల పురోగతిపై సమీక్ష
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనుల పురోగతిపై విద్యాశాఖ, సమగ్రశిక్ష, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ సమగ్రశిక్ష అదనపు కోఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తంలతో కలసి నాడు- నేడు పనుల పురోగతి పై సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంఈఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు నాడు- నేడు కింద పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెండో విడతలో చేపట్టిన పనుల పురోగతికి సంబంధించి ఎంపిక చేసిన పాఠశాలల్లో రోజువారి పనుల ప్రగతి పరిశీలించాలని, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత ఎస్‌సిలు పరిశీలించి నాణ్యతతో పనులు పూర్తిచేసేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు తగు సూచనలు ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు పనులలో ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా మేజర్ మైనర్ రిపేర్లు పనితీరుపై దష్టి సారించాలని తెలిపారు. నాడు-నేడు పనుల పురోగతికి సంబంధించి కంట్రోల్ రూమ్ ద్వారా పాఠశాలల వారీగా, ప్రాజెక్టుల వారీగా పురోగతి ని సమీక్షించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్‌ఈలు విజరు కుమార్‌రెడ్డి, వెంకటరమణ, దేవానందం, అధికారులు జిల్లా కేంద్రం నుంచి పాల్గొన్నారు.










