నాడు- నేడు పనుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
పనులన్నింటినీ సమాంతరంగా చేయాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
అత్యుత్తమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేయాలని భావించడం జరిగిందని, ఈ పనులలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నాడు- నేడు కార్యక్రమం పనులను చేయిస్తున్న వివిధ ఇంజనీరింగ్ శాఖలు, ఎంపీడీఓలు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రివాల్వింగ్ ఫండ్ మంజూరు అయిన పలు పాఠశాలలో 80% కన్నా తక్కువ నమోదు చేయడం జరిగిందని వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. తక్కువ పెర్ఫార్మన్స్ ఉన్న మండలాల అధికారులను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్‌లకు సంబంధించి అంచనాలను వెంటనే రూపొందించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో 1209 పాఠశాలలకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని క్షేత్రస్థాయిలో ఏఈలు సచివాలయ సిబ్బంది పరిశీలించాలని ఫోటోలతో సహా పైస్థాయి అధికారులకు తెలియజేయాలన్నారు. మండల స్థాయి అధికారులు రోజు రెండు మూడు స్కూళ్లను పరిశీలించాలన్నారు. అదనపు తరగతులకు సంబంధించి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. సెంట్రల్ పెక్యూర్మెంట్ ఐటమ్స్ గా ఉన్న పలు పరికరాలకు సంబంధించి వెంటనే అప్లోడ్ చేయాలని అన్నారు. ఇందులో ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డ్, ఫ్యాన్లు, శానిటరీ , పెయింటింగ్ లు, డ్రింకింగ్ వాటర్, స్మార్ట్ టీవీలు, రూప్ రిపేర్లు, టైల్స్, జిఐ డోర్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, జిఐ విండోస్ తదితర వస్తువులకు సంబంధించి కావాల్సినవి వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. ఈసందర్భంగా 2.1 ఫార్ములాను ఉపయోగించాలని ఎస్‌ఎస్ ఏ ఏపి సి వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ విజరు కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల ఎస్‌ఈ దేవానందం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శోభారాణి, చిత్తూరు నగరపాలిక కమిషనర్ జె.అరుణ పాల్గొన్నారు.










