సైకిల్‌యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.పావని
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
'నాడు-నేడు'ను హాస్టళ్లకూ వర్తింపజేసి సొంత భవనాలను నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.పావని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర ఐదోరోజు శుక్రవారం పట్టణంలో కొనసాగింది. యాత్ర గురువారం రాత్రి తాడేపల్లిగూడెం చేరుకోగా పలు హాస్టళ్లను నేతలు సందర్శించారు. బిసి బాలికల వసతిగృహంలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో శ్లాబ్ నుంచి నీరు కారుతోందని, పై పెచ్చులూడి పడుతున్నాయని విద్యార్థినులు వాపోయారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ విద్యాలయాలపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం హాస్టళ్లు అద్దె భవనంలో నడుపుతున్నారన్నారు. భవనాల నిర్వహణకు ప్రభుత్వం సరిపడా సొమ్ము చెల్లించడం లేదని, ఫలితంగా హాస్టల్లో ఉండే విద్యార్థులు అనేక ఇబ్బందుల పాలవుతూ అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పలు పాఠశాలలను, కళాశాలలను యాత్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు మాట్లాడుతూ జెడ్‌పి పాఠశాల ఆవరణలో ఉన్న జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవన్నారు. ప్రభుత్వం తరగతి గదులు నిర్మించకపోవడం దుర్మార్గమన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని, పాఠశాల విద్యార్థులకు మెస్‌ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందజేయాలని కోరారు. అనంతరం పెంటపాడు జూనియర్, డిగ్రీ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి.వాసు మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా ఉండటం దారుణమన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఎంచుకునే స్వతంత్రత ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవసరమైన వసతులు అన్ని జిల్లాల్లో ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి.రవిబాబు, పి.నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్‌డి.జాన్, నాయకులు సింధు, శ్రీను, చిరంజీవి, ఈశ్వర్, శ్రీకాంత్, సాయిలాల్ పాల్గొన్నారు.










