Aug 03,2022 21:47

'నాడు- నేడు' ద్వారా మంచి వాతావరణంలో బడులు
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌

నాడు-నేడు పనుల ద్వారా విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకోవడానికి వీలవుతుందని, అటువంటి పరిస్థితులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ అన్నారు. పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనులు మంజూరు కావడంతో, పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పాఠశాల భవనాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. గ్రామం ఉన్న వైపు కాకుండా మరో వైపు పాఠశాల నిర్మిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని, అటువైపు హైవే దాటాల్సిన పరిస్థితి ఉందని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఇప్పుడున్న చోటనే అదనపు క్లాస్‌ రూములు, ఇంకా కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం హైవే వైపు ఉన్న స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, తహశీల్దార్‌ విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.