Apr 28,2023 08:22

బుధవారం నాడు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిర్వాసిత రైతులు

             అనంతపురం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని పోతులనాగేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బలవంతంగా లాగేసుకుంటే... వైసిపి హయంలో ఇళ్ల పట్టాల కోసం లే అవుట్‌లు వేసి పంచేశారు. ప్రభుత్వాల నిర్ణయాలతో తరతరాలుగా భూమిపై ఆధరపడి బతుకుతున్న ఈ రైతు కుటుంబాల బాధలు అరణ్యరోదనే అవుతున్నాయి.
నాడు ఏమి జరిగింది..!
ధర్మవరం పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాల నిర్మాణం కోసమని పోతులనాగేపల్లి గ్రామం పరిధిలో 90 మంది రైతులకు సంబంధించి 210 ఎకరాల భూమిని 2018లో సేకరించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. పట్టణానికి ఆనుకుని ధర్మవరం-పుట్టపర్తి రహదారి సమీపంలో ఉండటంతో అక్కడి భూములకు విలువ ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మొదట ఎకరానికి రూ.3.50 లక్షలు మాత్రమే పరిహారమిచ్చే విధంగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు సిపిఎం, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇంత తక్కువ మొత్తానికి ఇవ్వమని ఆందోళన చేయడంతో ఐదు లక్షల రూపాయలకు అధికారులు పెంచుతూ నిర్ణయం చేశారు. అయితే రైతులు అంగీకరించలేదు. భూసేకరణను అడ్డుకున్నారు. అయితే అప్పటి పాలకులు అధికారులతో కలిసి బలవంతంగా జెసిబిలతో పంటలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో రైతులు పెద్దఎత్తున పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగానున్న ఇప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరరెడ్డి కూడా మద్దతు తెలిపారు. మరోమారు అధికారులు చర్చలు జరిపి ఐదు లక్షలతోపాటు ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిలో నుంచి నాలుగు సెంట్ల నుంచి 20 సెంట్ల వరకు భూమిని నిర్వాసితులకు ఇస్తామని అప్పటి ఆర్డీవో లిఖితపూర్వకంగా హామీని సైతం ఇచ్చారు. ఇందుకు కొంత మంది రైతులు అంగీకరించారు. 38 మంది రైతులు ఈ పరిహారం అందుకున్నారు. తక్కిన వారు దీనికి కూడా అంగీకరించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. ఇదే సమయంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ భూములను జగనన్న లే అవుట్‌ కింద మార్చి పేదలకు పంపిణీ చేశారు. నిర్వాసితులకు మాత్రం పరిహారం అందలేదు. ఇస్తామన్న భూమినీ ఇంత వరకు ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎకరం మూడు కోట్ల వరకు విలువ ఉంటే తమకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే సరిపోదని, పెంచాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని బుధవారం నాడు కాన్వరుకు అడ్డంగా వెళ్లి వినతిపత్రం అందజేసే ప్రయతాన్ని నిర్వాసిత రైతులు చేశారు.
రైతులకు అన్యాయమే జరిగింది... ఇప్పుడేమీ చేయలేం
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే

నాడు టిడిపి హాయాంలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు. ఐదు లక్షల రూపాయలు కోర్టులో డిపాజిట్‌ చేశారు. దీన్ని పెంచాలని నేను ఎమ్మెల్యే అయిన తరువాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. కాని ఒకసారి పెంచితే రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఇటువంటి డిమాండ్లు వస్తాయని, పెంచలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గత పాలకులు చేసిన తప్పులకు పరిహారం విషయంలో రైతులకు అన్యాయం జరిగింది.
న్యాయమైన పరిహారం ఇవ్వాలి.
ఎం.ఇంతియాజ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి, సత్యసాయి జిల్లా

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో బలవంతంగా భూసేకరణ చేస్తుంటే, రైతులకు అండగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేశాం. ఐదు లక్షల పరిహారంతోపాటు, 20 సెంట్ల వరకు స్థలమిస్తామని అప్పటి ధర్మవరం ఆర్డీవో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కాని అమలు జరగలేదు. వాస్తవిక ధర ఎకరానికి అక్కడ మూడు కోట్ల వరకు ఉంది. ఇప్పుడు ఇచ్చే పరిహారం నామమాత్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. పెంచి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం పరిశీలించి పెంచి ఇవ్వాలి. అదే విధంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి. దీనిపై రైతులు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుంది.
నాటి అన్యాయంపైనా టిడిపి స్పందించాలి
వి.రాంభూపాల్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి అనంతపురం.

రైతులు ముఖ్యమంత్రి కాన్వారుకు అడ్డుపడి తమ సమస్యను విన్నవించే ప్రయత్నం చేశారు. కాని ముఖ్యమంత్రి రైతుల సమస్యలను వినకుండానే వెళ్లిపోయారు. తాము కూడా ఈ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే టిడిపి హయాంలో జరిగిన బలవంతపు భూసేకరణపైనా కూడా లోకేష్‌ స్పందించాల్సిన అవసరముంది. ఇద్దరి మధ్యలో రైతులు నష్టపోయారు. వారిని ఆదుకునే చర్యలు ఇప్పటికైనా ప్రభుత్వం చేపట్టాలి. రైతులతో చర్చించి న్యాయమైన పరిహారం అందించాలి.
కోర్టులో ఉన్నందునే పరిహారం అందలేదు
అరుణ్‌బాబు సత్యసాయి జిల్లా కలెక్టర్‌.

పోతులనాగేపల్లి పరిధిలో 90 మంది నిర్వాసిత రైతులుంటే 38 మంది రైతులకు పరిహారం అందింది. తక్కిన వారు అంగీకరించక కోర్టుకు కెళ్లారు. దీంతో వారిక్విలేకపోయాం. పరిహారం మొత్తం ధర్మవరం ఆర్డీవో వద్దనే ఉంది. ఈ వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడాన్ని ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు.