ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : మున్సిపల్ ఆప్కాస్ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని,మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్ ఆటో డ్రైవర్ల కు18,500 కనీస వేతన ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళనలు చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ భవన్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు,పట్టణ కార్యదర్శి ధనాల దానయ్యలు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో దళారీ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గురు, శుక్రవారాలలో మున్సిపల్ కార్యాలయాలు వద్ద రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పనులు మాని ఈ నెల 27వ తేదీన మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఆగస్టు ఏడో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడమంచిలి బాబు, కె.దయామణి, బాదంపూడి గంగ, కండెల్లి సుమలత, కొల్లి.సార పాల్గొన్నారు.










