Feb 23,2023 16:16

ప్రజాశక్తి-గోకవరం : విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు అన్నారు గురువారం గోకవరం సంజీవయ్య నగర్ లోని కెవిఎస్ డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కోళ్ల వీరస్వామి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రధమ బహుమతులు సాధించిన విజేతలకు ప్రశంస పత్రాలు మెమొంటోలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మబడి విద్యా దీవెన వసతి దీవెన జగనన్న గోరుముద్ద సంక్షేమ పథకాల వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తూ అక్షరాస్యత పెంపొందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాక పధకాల ద్వారా విద్య అభ్యసించి మహిళా సాధికారత స్వయం నిర్ణయాధికారాలు పొందుతున్నారని అన్నారు. నేడు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకల ద్వారా ప్రభుత్వ కళాశాలలకు దీటుగా మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రెడ్డిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎస్ ప్రసాద్, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, గోకవరం మండలం సచివాలయాల కన్వీనర్ దాసరి రమేష్, వైసీపీ నాయకులు సుంకర వీరబాబు, వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వరసాల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.