- ఎంఎల్ఏ వెంకటే గౌడ
ప్రజాశక్తి-వీకోట : రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా పేదలకు అందజేస్తున్నామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. మండల పరిధిలోని కొంగాటం పంచాయితీ పడిగల కుప్పం సచివాలయ పరిధిలో రెండవ రోజు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని సర్పంచ్ అనిత జయరాం రెడ్డి తో కలసి ప్రారంభించారు. గడచిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. విభూది ఎల్లాగరం, అట్రపల్లి, మహమ్మద్ పురం ,సందగట్టు, పసలమంద గ్రామాల్లో ఈ పర్యటన కొనసాగింది. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తోందని ఎమ్మెల్యే వెంటేగౌడ తెలిపారు. సామాజిక భద్రతా పింఛన్లు అందించడంలో దేశానికి ఆదర్శంగా రాష్టం నిలిచిందన్నారు. నాడు నేడు పనులతో ప్రభుత్వ బడుల రూపురేకులు మార్చివేసి, కార్పొరేట్ కు దీటుగా పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. రైతుల కష్టాలు గుర్తించి వారికి మెరుగైన సేవలు అందించడంలో రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు. మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలతో మహిళలు రాష్ట్రంలో ఆర్థిక శక్తిగా ఎదిగారన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన పలు వినతులను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఎంపీపీ యువరాజ్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి, రెస్కో మాజీ చైర్మన్ ఆర్ హెచ్ జయరాం రెడ్డి, ఎంపీటీసీలు కమలనాభం, సమద్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










