Nov 04,2022 22:24

దొరసానమ్మ, వ్యవసాయ అధికారి, తిరుపతి జిల్లా

ముసురువాన మంచిదే..!
పంటలకు అదునుగా వర్షం ... అన్నదాతల్లో హర్షం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

'ఈ ముసురు వర్షం రైతులకు లాభదాయకమే.. ఎటువంటి నష్టం లేదు.. గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు మత్స్యకారులు, రైతులు, ముంపు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరంలా వర్షాల వల్ల తీవ్ర నష్టం వస్తుందన్న ఆందోళన వద్దు..' అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు తిరుపతి జిల్లాలో మొత్తం 34 మండలాలు ఉంటే రామచంద్రాపురం, బాలాయపల్లి, తిరుపతి రూరల్‌ మండలాల్లో అధికశాతంలో వర్షం నమోదయ్యింది. రామచంద్రాపురం మండలంలో 763.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 20.7 శాతం అదనంగా నమోదయ్యింది. అలాగే బాలాయపల్లిలో 792.42 మి.మీ. వర్షపాతం పడాల్సి ఉండగా 28.4 శాతం నమోదయ్యింది. తిరుపతి రూరల్‌లో 728.0 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా 22.9 శాతం ఎక్కువగా పడింది.
మిగిలిన 20 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. తక్కువగా 11 మండలాల్లో నమోదయ్యిందని రెయిన్‌ఫాల్‌ చీఫ్‌ ప్లానింగ్‌ విభాగం అధికారికంగా తెలిపింది. ఈ నేపథ్యంలో రేణిగుంట, డక్కిలి, పిచ్చాటూరు, కెవిబిపురం, తడ, వెంకటగిరి, ఏర్పేడు మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన అన్ని మండలాల్లోనూ నార్మల్‌గా కురిసింది. గత సంవత్సరం కంటే వర్షపాతం నమోదు తక్కువగా ఉందని పేర్కొంది.
ఇప్పటివరకూ అనుకూలమే
దొరసానమ్మ, వ్యవసాయ అధికారి, తిరుపతి జిల్లా
గత ఏడాదివలే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి ముంపుకు గురవుతుందేమోనని కంగారుపడ్డాం. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు భారీ వర్షాలు పడటం వల్ల పొలాలే కాదు గ్రామాలే ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులను, రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేశాం. ఇప్పటివరకూ పడిన వర్షపాతం నమోదు చూస్తే రైతులకు ఎటువంటి నష్టం లేదు. మేలు చేసే రకంగానే ఉంది. రబీ సీజన్‌లో వరి నాట్లు వేశారు. అయితే రైతులకు నష్టదాయకం ఏమీ లేదు. జిల్లాలో 5,755 ఎకరాల్లో ముఖ్యంగా నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరంగా వేశారు. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిల్లకూరు మండలంలో పత్తి 32 ఎకరాల్లో సాగవుతుంది. ఇది శుభపరిణామం. గతంలో తిరుపతి జిల్లాలో పత్తి పంట పండేది కాదు. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. గతంలో చెరకు పంట ఎక్కువగా సాగయ్యేది. ఫ్యాక్టరీలు మూతబడడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు.