Mar 05,2022 15:35

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఒక పథకం ప్రకారం అన్నీ స్కీములను నిర్వీర్యం చేస్తున్నదని చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు విమర్శించారు. శనివారం పుత్తూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఎన్నికల సందర్భంగా జగన్‌ మోహన్‌ రెడ్డి హామీలు ఇచ్చిన సందర్భంగా ఒక్కటి కూడా నెరవేర్చక నీరుగార్చారని తెలిపారు. ముస్లిం యువతకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని నమ్మించి మోసం చేశారు. అదే విధంగా మైనార్టీ సబ్‌ ప్లాన్‌తో పాటు ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. ముస్లిం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా కూడా నిధులను విడుదల చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా రంజాన్‌ తోఫా, ముస్లిం యువతకు దులహన్‌ పథకం ద్వారా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇస్తున్న పథకానికి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి మేనిఫెస్టోలో ఇది చాలదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. విదేశీ విద్యావిధానం నిర్వీర్యం చేశారని, కార్పొరేషన్‌ ద్వారా రుణ సదుపాయం కూడా రద్దు చేశారని గుర్తు చేశారు. రంజాన్‌ పండుగ సమయాలలో మసీదులకు మరమ్మతులు చేస్తామని అది కూడా అమలులోకి తీసుకు రాలేదని విమర్శించారు. షాదీఖానాలు ప్రతి గ్రామానికి ఒకటి కట్టి ఇస్తామని అమలు చేయలేని హామీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చారని తెలిపారు. కబరస్తాన్‌ (స్మశానాలు)లకు ప్రహారీ గోడలు కట్టి, నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున చినబాబు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గంజి మాదవయ్య, చిత్తూరు జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, పుత్తూరు మున్సిపల్‌ పార్టీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, సీనియర్‌ నాయకుడు మహ్మద్‌ నబీ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కరుణా యాదవ్‌, ధనుంజయ యాదవ్‌, తెలుగు యువత రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ డీ జి ధనపాల్‌, బాబు యాదవ్‌, భరత్‌, ఎల్‌ఐసి రఫీ, జాబీర్‌, శబ్దార్ధ, కరీమా, తురాబ్‌, సందానీ, ఏలుమలై రెడ్డి, పాల్గొన్నారు.