Sep 21,2023 22:12

మూషిక వాహనంపై ఊరేగిన వినాయకుడు
ప్రజాశక్తి- కాణిపాకం:

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఈనెల 18వ తేదీ సోమవారం నుంచి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం వినాయకుడు మూషిక వాహనంపై కన్నులపండుగా ఊరేగారు. ఉత్సవ ఉభయదారులైన కాణిపాకం, తిరువనంపల్లె, కానిపాక చినకాంపల్లి గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులచేత స్వామివారి మూలవిరాట్‌కు ఉదయం అభిషేకం నిర్వహించారు. తరువాత వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ ఈవో వెంకటేశులు ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, అర్చకులు సోమశేఖర్‌ గురుకుల్‌, గణేష్‌ స్వామి ఆధ్వర్యంలో ఆలయంలోని అనివేటి మండపంలోని యాగశాలలో సిద్ధిబుద్ధి సమేత ఉత్సవమూర్తులను ఉంచి వేదపండితుల మంత్ర ఘోషనడుమ అభిషేకించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తరువాత మయూర వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి మంగళ వాయిద్యాలు నడుమ కాణిపాకం గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.