Feb 19,2022 21:23

బాటిళ్లలో నింపిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచి వస్తున్న కలుషిత తాగునీరు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
'ఈ బాటిళ్లలో కనిపిస్తున్నది మున్సిపల్‌ అధికారులు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌నుంచి సరఫరా చేసే నీరు.. ఏంటి నల్లగా ఉంది అనుకుంటున్నారా..? మా అధికారులు ఆ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసి నెలలు గడిచాయో, ఏళ్లు గడిచాయో తెలియదు.. అందువల్లే పాచిపట్టిన నీరు నల్లగా కనిపిస్తోంది.. ఈ నీటినే తాగి చావండి' అనే నిర్లక్ష్య ధోరణి మున్సిపల్‌ అధికారులు కనిపిస్తుండటం ఆ ప్రాంత ప్రజలను బాధిస్తోంది.
పట్టణంలోని కొండమిట్ట ప్రాంత ప్రజలు కలుషితమైన తాగునీటితో ఇబ్బంది పడుతున్నారు. కొండమిట్ట పరిధిలో ఉన్న 20, 21, 22వ వార్డులకు తాగునీటిని సరఫరా చేస్తున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకు గుండా గత రెండ్రోజులుగా మురుగునీరు వస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆ మూడు వార్డుల పరిధిలోని సుమారు 2 వేల మంది జనాభా గత్యంతరం లేక పాచిపట్టి, పురుగులు తేలి మలినాలున్న నల్లటి నీటినే తాగాల్సి వస్తోంది. దీంతో పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నామంటూ స్థానికులు మండిపడుతున్నారు. మూడు వార్డుల ప్రజలకు ప్రధానంగా ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను శుభ్రపరిచి నెలలు గడుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ హెల్త్‌, అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న అధికారులు పబ్లిక్‌ వినియోగించే తాగునీరుపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదంటూ మండిపడుతున్నారు. ట్యాంకునుంచి వచ్చే మురుగునీటిని తాగి మరింతమంది అస్వస్థతకు గురికాకమునుపే మున్సిపల్‌ అధికారులు స్పందించి తాగునీటిని శుభ్రపరిచి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయాలని కొండమిట్ట ప్రజలు కోరుతున్నారు.