మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో జరిగిన ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కౌన్సిల్ సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో భాగంగా ప్రకారం మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. మాటతప్పని మడమతిప్పని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడాలని వారి డిమాండ్ చేశారు. ధరల నియంత్రణ లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు చాలీచాలని వేతనాలతో తీవ్రమైన అసౌకర్యాలకు గురవుతున్నారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు డ్రెయినేజీ పనులలో పనిచేస్తూ మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కార్మికుల కుటుంబానికి రూ.40 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని కోరారు. మున్సిపల్ రంగంలో శాశ్వత పనిలో పని చేస్తున్న డెయిలీవేర్ కార్మికులను అప్కస్లో చేర్చి ప్రస్తుతం ఒప్పంద కార్మికులకు ఎంత వేతనం చెల్లిస్తున్నారో అంతే మొత్తం ఈ కార్మికులకు కూడా ఇవ్వాలని సాంఘిక భద్రతలో భాగమైన పిఎఫ్ ఇఎస్‌ఐ వర్తింపజేయాలన్నారు. జిఒ నెంబర్ 25 ప్రకారం విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు స్థానిక మున్సిపాలిటీల నుంచి రూ.2 లక్షలు ప్రమాదాల బారిన పడి మరణిస్తే రూ.5 లక్షలు ఆ కుటుంబాలకు చెల్లించి వారి కుటుంబ సభ్యులను తిరిగి ఆ పనుల్లో పెట్టుకోవాలని వారి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు నివేశస్థలాలు ఏర్పాటు చేసి శాశ్వత గృహాలను నిర్మించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డైలీ వేస్ కార్మికులు స్కూల్ స్వీపర్ల వేతనాలు సత్వరం విడుదల చేయాలని వారి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని వారు తెలిపారు. సమావేశంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గుంజి కిషోర్, జిల్లా గౌరవాధ్యక్షులు మల్లి అంకయ్య, నగర అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, తన్నీరు వెంకటేష్, పట్టణ నాయకులు ప్రభావతి, రాజేష్, తన్నేరు రమాదేవి, సుభాన్, కుంచాల వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










