అనంతపురం ప్రతినిధి : మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు, తరువాత ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి నిలుపుకోవాలని ఎపి మున్సిపల్ వర్కర్సు అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని వికె.మొమోరియల్ హాలులో గురువారం నాడు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఈయనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తాము అధికారంలోకి వస్తూనే రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోనే హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ తరువాత అసెంబ్లీలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రకటించారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనమిస్తామని కూడా హామీనిచ్చారన్నారు. కాని ఇప్పటి వరకు ఆ హామీని నెరవర్చే దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది కార్మికులు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారన్నారు. వీరిలో అత్యధికులు ప్రమాదభరిత పరిస్థితులు పనిచేస్తున్నారన్నారు. వారికి ఉద్యోగ భద్రతగానీ, సరైన వేతనంగానీ లభించడం లేదని అన్నారు. 20 సంవత్సరాలకుగాపైనా పనిచేస్తున్న వారికి కూడా వేతనాలు నామమాత్రంగానే ఉన్నాయన్నారు. అప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడమే మినహా ఒరిగిందేమి లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుయుటీ, ఎన్‌కాష్‌మెంట్ లీవ్, పింఛను తదితరం లేవన్నారు. ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదని చెప్పారు. ఇలా అన్ని రకాలుగా కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగులిచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి తన హామీని నిలుపుకోలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనమిస్తామని హామీనిచ్చిందన్నారు. సర్టిఫికెట్లు లేవన్న పేరుతో స్కిల్డ్‌కు కూడా సెమీస్కిల్డ్ పేరుతో జీతం తక్కువ ఇస్తున్నారన్నారు. రూ.15 వేలకు మించి జీతాలివ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి తగిన రితీలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్, నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఎపి మున్సిపల్ వర్కర్సు అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎటిఎం నాగరాజు, ఇంజినీరింగు విభాగం నాయకులు పాల్గొన్నారు.










