Sep 16,2023 21:34

ర్యాలీ నిర్వహిస్తున్న ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు, కార్మికులు

           ప్రజాశక్తి-రాయదుర్గం   పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైకుయాత్ర శనివారం రాయదుర్గానికి చేరుకుంది. కనేకల్‌ రోడ్డు నుంచి లక్ష్మీబజార్‌ వినాయక కూడలి, అక్కడి నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాయదుర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్సు, క్యాజువల్‌ సెలవులు, పండుగ సెలవులు, జాతీయ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు జీవో ప్రకారంగా సెలవులను మంజూరు చేయకుండా గొడ్డుచాకిరీ చేయించుకోవడం బాధాకరమన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కమిషనర్‌ దివాకర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా నాయకులు ఓబుళపతి, మురళి, మల్లికార్జున, రాయుడు, రవికిరణ్‌, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, స్థానిక నాయకులు రాము, మల్లేష్‌, తిప్పేస్వామి, వన్నూరు స్వామి, తదితరులు పాల్గొన్నారు.