ప్రజాశక్తిం-అనంతపురం కలెక్టరేట్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయన్నారు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్, ఇంజినీరింగ్, ఎన్‌ఎంఆర్, మలేరియా, కోవిడ్, గార్బేజ్, క్లాప్ డ్రైవర్స్ , స్కూల్ స్వీపర్స్, అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు మున్సిపల్ కార్మికులతో సొంత పనులు చేయించుకుంటున్న రాయదుర్గం శానిటరీ ఇన్స్‌పెక్టర్ రవీంద్రయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన నిర్మాకం వల్ల ఓ కార్మికుడు గాయపడిన విషయం తెలిసిందే అన్నారు. కాగా సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, హెల్త్ కార్డులు, రక్షణ పరికరాలు, సమాకంలో పనిముట్లు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, ఇపిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కార్మికుల, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు నివాస గృహాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దుమ్మూ, ధూళి, మురికి, మలినాలు, విషపురుగులు, జంతు కళేబరాల మధ్య విధులను నిర్వహిస్తూ అనేక మంది కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. అలాంటి కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పాలకవర్గం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేకమార్లు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సమ్మెలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని ఈనెల 8వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లాపర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బత్తల ఆదినారాయణ, సహాయ కార్యదర్శి ఎం.లక్ష్మీనరసమ్మ, నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారు ఎర్రిస్వామి, సాకే తిరుమలేష్, ఉపాధ్యక్షులు బంగ్లా రాఘవేంద్రప్రసాద్, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి, సిఐటియు జిల్లా నాయకులు ఎజి.రాజమోహన్, యూనియన్ లీడర్లు మాలతి, సుజాత, భారతి, వరలక్ష్మి, జరీనా, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు










