Aug 17,2023 21:53

డిఎంఎకు వినతిపత్రం ఇస్తున్న మున్సిపల్‌ కార్మికసంఘం నాయకులు

      అనంతపురం కార్పొరేషన్‌ : కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో పని చేస్తున్న పారిశుధ్య ఇతర విభాగాల్లోని కార్మిక సమస్యల పరిష్కారంపై ఆయా కమిషనర్లు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, వీటిపై స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని సిఐటియు నాయకులు డిఎంఎను కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కోటేశ్వరరావుకు గురువారం నాడు వినతిపత్రం అందజేశారు. జిల్లా మున్సిపల్‌ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన ఆయన్ను పిజెఆర్‌ ఫంక్షన్‌ హాల్లో కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాల్టీల్లో మృతి చెందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతున్నా ఏడాదిగా కమిషనర్లు పట్టించుకోవడం లేదన్నారు. 60 సంవత్సరాల పూర్తియ్యిందన్న కారణంతో తొలగించిన కార్మికులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. రాయదుర్గంలో సొంత పనులకు కార్మికులను ఉపయోగిస్తున్న శానిటరీ ఇన్ప్ప్‌ఎక్టర్‌ రవీంద్ర యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. రెగ్యులర్‌ కార్మికులకు సిపిఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. రెండు సంవత్సరాలుగా బకాయి ఉన్న సరెండర్‌ లీవ్‌ అమౌంట్‌ను ఇప్పించాలన్నారు. స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. వీటితో పాటు కార్మికులు దీర్ఘకాలికంగా ఎదర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. దీనిపై డిఎంఎ స్పందిస్తూ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం జిల్లా కోశాధికారి బత్తల ఆదినారాయణ, నగర అధ్యక్షులు బండారు ఎర్రిస్వామి, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ నగర ప్రధాన కార్యదర్శి మురళి, రాయుడు, సుబ్బారెడ్డి, పోతలయ్య, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప పాల్గొన్నారు.