Oct 28,2023 21:51

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య

మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం పట్టణంలోని 1వ మాస్టర్‌ పాయింట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి అమలు కాలేదన్నారు. కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా ఎన్నో సంవత్సరాల నుండి పనులు చేస్తున్న కార్మికులకు తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తున్నారని తెలిపారు.
చాలీచాలని జీతాలతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. 11వ పిఆర్‌సి ప్రకారం రూ.20వేలు జీతం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రూ.15 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు తుడిపేసుకుంటుందని దుయ్యబట్టారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఎలాంటి బెనెఫిట్స్‌ ఇవ్వకుండా నిర్థాక్షణ్యంగా ఇంటికి పంపుతున్నారని ఇది చాలా దుర్మార్గమన్నారు. డైలీ కూలీల పేరుతో అతి తక్కువ జీతాలు ఇచ్చి కార్మికులతో ఎక్కువ పనులు చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనాలు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో రాబోయే రోజులలో కార్మికులు పెద్దఎత్తున పోరాటాలు కొనసాగిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బిడదల మహేష్‌, బాబు, క్రాంతి, మహిళ నాయకులు లేటి రాజేశ్వరి, చేవూరి సునీత, కార్మికులు పాల్గొన్నారు.