అనంతపురం కార్పొరేషన్ : సమస్యల పరిష్కారంపై మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు దశలవారీగా పోరాటాలను నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ తెలిపారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లను తీర్చాలని కోరుతూ శుక్రవారం నాడు జిల్లా వ్యాప్త బైక్‌ర్యాలీ అనంతపురం కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ ర్యాలీని ఎస్.నాగేంద్ర కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఈ డిమాండ్లపై వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రెండు రోజుల బైక్ ర్యాలీని చేపట్టామన్నారు. బైక్ ర్యాలీ అన్ని మున్సిపాల్టీల్లో పర్యటించి కార్మికులను సంఘటితం చేస్తామన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలన్నారు. హెల్త్, రిస్కు అలవెన్స్‌లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఓల్డ్‌టౌన్ ప్రధాన కార్యదర్శి వై.వెంకటనారాయణ, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం.నాగరాజు, కె.నాగభూషణ, నగర అధ్యక్షులు బండారు ఎర్రిస్వామి, ఇంజినీరింగ్ సెక్షన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఓబులపతి, మురళి, మల్లికార్జున, రాయుడు, అంజి కార్మికులు పాల్గొన్నారు.










