అనంతపురం ప్రతినిధి : ఆకాశం నల్లగా కమ్ముకుని రావడం... వర్షం చినుకులు వస్తాయని ఆశపడడం. ఇంతలోనే ఈదురుగాలులకు మేఘాలు మాయమవడం ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు. కమ్ముకొచ్చిన మేఘాలు చినుకు రాల్చకముందే తరలిపోతున్నాయి. మేఘాలు ఆవిరివుతున్నట్లే ఈ ఖరీఫ్ ఆశలు కూడా రైతులకు ఎగిపోతున్నాయి. విత్తనం విత్తుకునేందుకు జులై మాసమే సరైంది. కాని ఇప్పటి వరకు జిల్లాలో సగానికి పైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాగు కూడా పది శాతంలోపే ఉంది.
ఆరు శాతంలోపే సాగు
అనంతపురం జిల్లా పరిధిలో సాదారణ సాగు విస్తీర్ణం 9.15 లక్షల ఎకరాలుంది. ఇందులో ఇప్పటి వరకు సాగైంది చూస్తే కేవలం 50,699 ఎకరాలే. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో ఆరు శాతం వరకే పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా సాగయ్యే వేరుశనగ పంట మూడు శాతం వరకుంది. వేరుశనగ సాధారణం జిల్లాలో 7.69 లక్షల ఎకరాలయితే 19 వేల ఎకరాల్లో ఇప్పటి వరకు విత్తనం పడింది. ఆ తరువాత అత్యధికంగా సాగయ్యే ఆముదం, పత్తి పంటల పరిస్థితి ఇంచుమించు ఇదే రకంగా ఉండటం గమనార్హం. పత్తి సాధారణ సాగు 1.27 లక్షల ఎకరాలయితే, సాగైంది 21 వేల ఎకరాలు. ఆముదం సాధారణ సాగు 30 వేల ఎకరాలవుతే 3160 ఎకరాల్లో విత్తనం పడింది. కంది పంట 74 వేల ఎకరాలకుగానూ 160 ఎకరాల్లో విత్తనం పడింది. ఇలా అన్ని రకాల పంటల సాగు నామ మాత్రంగానే ఉంది.
18 మండలాల్లో వర్షాభావం
అనంతపురం జిల్లా పరిధిలో మొత్తం 31 మండలాలుంటే 18 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఇందులో మూడు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 77.6 మిల్లీమీటర్లు కురావాల్సి ఉండగా 60 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. సాధారణం కంటే 22 శాతం తక్కువ వర్షపాతం ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదయింది. ఇందులో చూసినప్పుడు కళ్యాణదుర్గం, బొమ్మనహళ్, విపడకనల్లు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. బొమ్మనహళ్ మండలంలో సాధారణ వర్షపాతం 68.6 మిల్లీమీటర్ల కురవాల్సి ఉండగా 26.7 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. సాధారణం కంటే 61.1 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. విడపనకల్లులో 96.9 మిల్లీమీటర్లకు పడాల్సి ఉండగా 30.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. ఇక్కడ 68.7 శాతం వర్షపాతం లోటుంది. ఇక కళ్యాణదుర్గంలో 79.4 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం పడాల్సి ఉండగా 26.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. ఇక్కడ కూడా 66.5 శాతం తక్కువ వర్షపాతం పడింది. ఇవి కాకుండా మరో 15 మండలాల్లో వర్షపాతం లోటు 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం పంటల సాగుపైనా పడుతోంది. పదును కాకపోవడంతో రైతులు విత్తనాలు వేసుకోలేని పరిస్థితుల్లోనున్నారు. ఈ వారంలో అయినా ఓ మోస్తరు వర్షాలు పడతాయో అన్న భావనంలో రైతులు ఆశగా మేఘం వైపు చూస్తున్నారు.










