
* 2020లోనే ప్రమాదకర వరద ముంపు ప్రాంతాల గుర్తింపు
* అధికారుల ప్రతిపాదనలకు పలుమార్లు కొర్రీలు
* మూడేళ్లుగా ఇదే తంతు
* కరకట్టలు లేక పలు గ్రామాలను ముంచెత్తిన వంశధార
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ ఉదాసీనం నదీ పరివాహక గ్రామాల ప్రజలను కష్టాల పాల్జేస్తోంది. మూడేళ్ల కిందట అధికారులు పంపిన ప్రతిపాదనలకు దిక్కు లేకుండా పోయింది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో వరద గట్లు నిర్మించాలని ప్రభుత్వమే నిర్ణయించినా నేటికీ ఆమోదం తెలపలేదు. మరోవైపు కరకట్టలకు సంబందించిన ప్రతిపాదనలను అధికారులు పంపుతున్నా ప్రభుత్వం అంచనా వ్యయం, భూసేకరణ అంటూ ఏదో ఒక కొర్రీ వేసి వెనక్కి పంపుతోంది. దీంతో వంశధార, నాగావళి కరకట్టల కొత్త పనులకు ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురిసిన వర్షాలకు వంశధార ఉధృతితో కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పొలాలను ముంచెత్తింది. దీంతో వర్షాకాలం నేపథ్యంలో నదీ పరివాహక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది
వంశధార, నాగావళి నదుల వరదల నుంచి నదీ పరివాహక గ్రామాల రక్షణకు గతంలో కరకట్టల పనులను ప్రారంభించినా ఫలితం లేకపోయింది. 2009-10 మధ్య కాలం వరకు కాస్తాకూస్తో పనులు జరిగినా, ఆ తర్వాత నుంచి ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. కరకట్టల నిర్మాణానికి పెద్దఎత్తున భూమిని సేకరించాల్సి ఉండడం, భూసేకరణకు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వం 2019లో ఉన్నపళంగా కరకట్టలను రద్దు చేసింది. వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ఆ విధంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అధికారులు 2020 ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు పంపారు. ముంపు తీవ్రత అధికంగా ప్రాంతాలను గుర్తించి అందులో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నాగావళి కరకట్టలకు సంబంధించి అధికారులు తొలుత ఐదు ప్రాంతాలను గుర్తించారు. నాగావళి నది పరివాహక ప్రాంతమైన ఆమదాలవలస మండలం తొగరాం వద్ద రూ.13.14 కోట్లతో, గండ్రేడు వద్ద రూ.8.82 కోట్లతో, బెలమాం వద్ద రూ.1.83 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బూర్జ మండలం అల్లెన నుంచి బూర్జ పాత కరకట్ట వరకు వరద గట్టు కోసం రూ.13.86 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మొత్తం రూ.37.65 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా వంశధార నదీ పరివాహక ప్రాంతంలో 22.77 కిలోమీటర్ల మేర కరకట్టలను నిర్మించేందుకు రూ.77.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపి మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు.
కరకట్టల పనుల పరిస్థితి ఇలా...
వంశధార నదిపై నిర్మించాల్సిన కరకట్టలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ పనులు 2007లో ప్రారంభించారు. ఇప్పటివరకు 7.55 శాతం పనులే పూర్తయ్యాయి. 2007లోనే మొదలైన ప్యాకేజీ-2 పనులు 5.66 శాతం మాత్రమే జరిగాయి. ప్యాకేజీ-3 పనులను కూడా 2007లో ప్రారంభించారు. 2.45 శాతం పనులు పూర్తి చేశారు. 2009లో ప్రారంభమైన ప్యాకేజీ-4 పనులు 21.32 శాతం మాత్రమే జరిగాయి. నాగావళి నదిపై నిర్మిస్తున్న కరకట్టల పరిస్థితి కూడా అలానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న కరకట్టలను నాగావళి-2 ప్యాకేజీ పనులుగా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్సు సంస్థకు రూ. 61.45 కోట్లకు పనులను అప్పగించారు. 2008లోనే ఆ సంస్థ పనులను ప్రారంభించింది. ఇప్పటికీ కూడా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. జిల్లా పరిధిలో 51.88 కిలోమీటర్ల మేర వరద కట్ట నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 17.29 కి.మీ పొడవు మేర మాత్రమే పని పూర్తయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వాటిని మే 29, 2019న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు ఎక్కడి పనులను అక్కడే నిలిపేశారు.
గ్రామాలను ముంచుతున్నా ఉదాసీనమే
అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఒడిశాలో కురిసిన వర్షాలకు వంశధారకు ఆకస్మిక వరద వచ్చింది. హిరమండలం మండలం గొట్టాబ్యారేజీ వద్ద గరిష్టంగా 77 వేల క్యూసెక్కులు నమోదైంది. వరద ఉదృతితో కొత్తూరు మండలంలోని పెనుగోటివాడ, మాతల, నివగాం, సోమరాజపురం, ఆకులతంపర లో పొలాలు ముంపునకు గురయ్యాయి. సుమారు 500 ఎకరాల్లో వరి, అరటి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో వరద హెచ్చరికలు జారీ చేసి హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత రక్షణ చర్యలను విస్మరిస్తోంది. దీంతో వర్షాకాలంలో నదీ పరివాహక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నదీ పరివాహక గ్రామాల వెంబడి కరకట్టలను నిర్మించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నాం
జిల్లాలో అత్యంత వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వం 2019లో సూచించింది అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి 2020లో పంపాం. పనులపై ప్రభుత్వం సూచించిన రిమార్కులను పరిగణనలోకి తీసుకుని తిరిగి పంపుతున్నాం. పనుల కోసం భూసేకరణ చేపట్టాలని సూచించించడంతో మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.
- సుధాకరరావు, ప్రత్యేక కట్టడాల విభాగం ఇఇ