Dec 07,2022 22:43

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ

ముంచుకొస్తున్న 'మాండూస్‌'
శ్రీ జిల్లా యంత్రాంగం అలర్ట్‌
శ్రీ కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌లైన్‌ నెంబర్‌
9491077356 ఏర్పాటు
శ్రీ సహాయక చర్యలకు
ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు
శ్రీ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
: కలెక్టర్‌, ఎస్‌పి వెల్లడి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు రానున్న నాలుగు రోజులు మాండూస్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించుటకు జిల్లా యంత్రాంగం పూర్తి సమాయత్తంగా ఉందని జిల్లా కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలో సమావేశమందిరంలో మండూస్‌ తుఫాన్‌ సహాయక చర్యల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్‌పి రిశాంత్‌ కుమార్‌రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మండూస్‌ తుపాను కారణంగా రానున్న నాలుగు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇందుకు సహాయక చర్యలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసామని, జిల్లా సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9491077356 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి శాఖలవారీగా తుపాను సమయంలో నిర్వహించవలసిన సహాయకచర్యల ధులను కేటాయించామని తెలిపారు. అలాగే వైద్య, విద్యుత్‌, తాగునీటి సరఫరా, పౌరసరఫరా శాఖలను అప్రమత్తం చేసామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా పోలీస్‌, అగ్నిమాపకశాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నానికి అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించగలరని, దీని ద్వారా ప్రాణనష్టం జరగకుండా నివారించగలమని ప్రజలను కోరారు. నీరు అధికంగా ప్రవహించే కాజ్‌వేలు, వాగులు, వంకలను ప్రజలు సిబ్బంది హెచ్చరించిన మేరకు దాటవద్దని సూచించారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణీ స్త్రీలను గుర్తించి ముందస్తుగా సురక్షితంగా ఆసుపత్రులకు చేర్పించాలని వైద్యాఅధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. రైతులు వారు నిలువ చేసిన పంట ఉత్పత్తులను సురక్షితంగా టార్బాలిన్‌ షీట్‌లతో కప్పి ఉంచడం ద్వారా కొంత మేర పంట నష్టం జరగకుండా నివారించవచ్చని అన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ తుపాను సహాయక చర్యలలో భాగంగా పోలీస్‌ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం 2 ప్లటూన్స్‌ ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బందాలను అందుబాటులో ఉంచామన్నారు. అలాగే జిల్లా పోలీస్‌ యంత్రాంగం ద్వారా అవసరమైన ప్రదేశాల్లో ముందస్తుగా బలగాలను ఏర్పాటు చేసామని, సహాయక చర్యలకు అవసరమైన మెటీరియల్‌లను అందుబాటులో ఉంచుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం సూచనల మేరకు ప్రజలు సహకరించాలని తెలిపారు.