Apr 11,2023 21:55

ములకలపెంట గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

       గుంతకల్లు రూరల్‌ : అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని ములకలపెంట గ్రామాన్ని మరో ఉద్దానం కానీయకుండా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తక్షణం స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. కిడ్నీ సమస్యలతో సతమతం అవుతున్న ములకలపెంట గ్రామాన్ని మంగళవారం నాడు సిపిఎం నాయకులు సందర్శించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జబ్బు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ములకలపెంట గ్రామానికి ప్రత్యేక వైద్య సిబ్బందిని పంపాలన్నారు. గ్రామస్తులకు యుద్ధప్రాతిపదికన వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జనరల్‌, బయోక్రిటిక్‌, ఎస్‌పిఎం శాఖలు, మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్తులకు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించాలన్నారు. ఒకే గ్రామంలో ఇంతమంది కిడ్నీ సమస్యలకు ఎందుకు గురవుతున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఒకే రోగంతో ఇంతమంది బాధితులుగా ఉండడం అసాధారణ విషయమన్నారు. ముందుముందు మరింత మంది ఈ జబ్బుకు బలికాకముందే తక్షణ వైద్యం అందించాలన్నారు. ఇక గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో మైనింగ్‌ జరుగుతోందని, ఇది కూడా ఏమైనా కారణమా.? అన్న విషయాలపై అధ్యయనం చేయాలన్నారు. భూగర్భ జలాలను సేకరించి వాటిని కూడా పరీక్షించాలన్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో మంచాన పడ్డ వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని వారి కుటుంబాలకు అవసరమైన జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డయాలసిస్‌ చేయించుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్తున్న బాధితులకు ప్రయాణ ఖర్చులు, అదునపు మందుల ఖర్చులకు అయ్యే డబ్బును ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై స్పందించి బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, బజంతరి శ్రీనివాసులు, నాగరాజు, కసాపురం రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.