గుంతకల్లు రూరల్ : గుంతకల్లు మండల పరిధిలోని ములకలపెంట గ్రామంలో కిడ్నీ సమస్యలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం 'అనంత ఉద్దానం' అనే శీర్షికతో ములకలపెంట గ్రామంలో కిడ్నీ సమస్యలపై ప్రజాశక్తి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన డా||గేయానంద్ సోమవారం నాడు ఆ గ్రామంలో పర్యటించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కిడ్నీ జబ్బుకు ఏ విధంగా గురైయ్యారు... అందుకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. బాధితులు చికిత్సలు చేయించుకున్న మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ములకలపెంట గ్రామంలో మూత్రపిండాల వ్యాధితో ఇద్దరు మరణించడం, ఐదుగురు మంచాన పడటం సాధారణ విషయం కాదన్నారు.ఒకే గ్రామంలో ఇంతమంది కిడ్నీ వ్యాధికి గురవడం అసాధారణ విషయం అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ గ్రామంలో వైద్య పరీక్షలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. జనరల్, బయోక్రిటిక్, ఎస్‌పిఎం శాఖలు, మెడికల్ కాలేజ్ విద్యార్థులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్లు రక్తం, సీరం తదితర పరీక్షలను నిర్వహించాలన్నారు. బీపీ, షుగర్ వల్ల కూడా కిడ్నీ వ్యాధి వస్తుందని ఆరకమైన పరీక్షలు కూడా చేయాలన్నారు. ఈ పరీక్షల్లో వ్యాధిగ్రస్తులు 10 శాతం ఉంటే సాధారణ విషయంగా, 20 శాతం కంటే ఎక్కువగా ఉంటే అసాధారణమైన విషయంగా పరిగణించాలన్నారు. ఇప్పటికే వ్యాధితో మంచాన పడ్డ వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. వారి కుటుంబాలకు అవసరమైన ఆర్థిక, వైద్య ఇతర సాయాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. డయాలసిస్ చేయించు కోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్తున్న బాధితులకు ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. భూగర్భ నీటిశాఖ అధికారులు సైతం గ్రామంలో నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. ములకలపెంట గ్రామంలోని కిడ్నీ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌కె.నాయుడు. సిఐటియు మండల కార్యదర్శి కసాపురం రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వైటి.చెరువు రమేష్ ఉన్నారు.










