Apr 14,2023 21:38

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ఈ నెల 17వ తేదీన నార్పలలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి భవనంలో రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి.ఉషశ్రీచరణ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి, ఎస్పీ కె.శ్రీనివాసరావులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని తెలిపారు. అధికారులంతా సమన్వయం చేసుకుని పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున తగినంత తాగు నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తగినన్ని 104,108 వాహనాలను,స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పాటు అవసరమైన వైద్యసిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యే డిగ్రీకళాశాల యూనివర్సిటీల విద్యార్థులు, జగనన్న వసతి దీవెన లబ్ధిదారులకు సరిపడే బస్సులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ ఆర్‌ఎం, డిటిసిలకు సూచించారు. మంత్రి కెవి.ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యే వివిధ కళాశాలల విద్యార్థులు, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి మాట్లాడుతూ, హెలిపాడ్‌ నుంచి సభాస్థలి వరకు చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆ మేరకు వారంతా ఆ విధుల్లో వారు నిమగం కావాలన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ ఎస్‌.మంగమ్మ, గుంతకల్‌, తాడిపత్రి ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర విద్యాసలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌ కుమార్‌, ఆర్డీవో మధుసూదన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బహిరంగ స్థలం, ఏర్పాట్లు పరిశీలన
నార్పల : ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నార్పలలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలి ప్రాంతం, హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్‌, రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ కె.శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.