Jul 05,2023 22:34

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌, కలెక్టర్‌ ఎం.గౌతమి

         కళ్యాణదుర్గం : ఈ నెల 8న కళ్యాణదుర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌తో కలిసి బుధవారం నాడు ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుమునుపు బహిరంగసభ వేదిక, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, వై.శివరామిరెడ్డి, మంగమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ కంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టిగా కషి చేయాలని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలూ ఆయా శాఖల పరిధిలో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌,ఎస్పీల ద్వారా జారీ చేసిన ఆదేశాలు, అప్పగించిన పనులను అధికారులు బాధ్యతయుతంగా పూర్తి చేయాలని సూచించారు. సభకు హాజరవుతున్న అతిథులు, రైతులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌, పార్కింగ్‌, పారిశుధ్య పనులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, బ్యారికెడ్స్‌ ఏర్పాటు, బహిరంగ సభ వేదిక, తాగునీటి సరఫరా, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం, ప్రోటోకాల్‌ తదితర అంశాలపై దృష్టిని సారించాలన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరూ కూడా సమిష్టి బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి సభను విజయయంతం చేయాలని కోరారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కార్యక్రమాన్ని అధికారులు సమిష్టి కషితో విజయవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 2022 ఇన్సూరెన్స్‌ను ఈ నెల 8వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1016 కోట్లను బటన్‌ నొక్కి రైతుల ఖాతాలోకి జమ చేస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 52 అగ్రి ల్యాబ్‌లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ నదీమ్‌ హమ్మద్‌, మైనార్టీ నాయకులు తాడిపత్రి ఫయాజ్‌ బాషా, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.