అనంతపురం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్ది పర్యటన ఖరారైంది. ఈ మేరకు అధికారిక ప్రకటనతోపాటు, షెడ్యుల్‌ను సమాచార శాఖ విడుదల చేసింది. ఈనెల 17వ తేదినే నార్పలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఖరారు అయ్యింది. అప్పట్లో అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసిన సమయంలో అనివార్య కారణాలతో పర్యటన రద్దయింది. దీంతో వైసిపి నాయకులు, అభిమానుల్లోనూ నిరాశనే మిగిలింది. అయితే తాజాగా మరోమారు ఆయన పర్యటన ఖరారవడంతో అధికారులు ఏర్పాట్లను యథావిధిగా చేపడుతున్నారు. నార్పల క్రాస్ వద్ద సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయ కర్త తలశీల రఘురాంలు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. నార్పలలోని జూనియర్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వేదిక వద్దకు వచ్చి వసతి దీవెన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ఈనెల 26వ తేదీన ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేయనున్నారు. 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి తొమ్మిది గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగుతారు. అక్కడ జిల్లా ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో ముఖాముఖి అవుతారు. 10.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నార్పల క్రాస్ వద్దకు చేరుకుంటారు. ఫొటో గ్యాలరీని తిలకిస్తారు. ఉదయం 11 గంటలకు వేదికపైకి వస్తారు. ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వసతిదీవెన చెక్కుల పంపిణీ అనంతరం 12.30 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. జిల్లా నేతల వీడ్కోలు అనంతరం హెలిక్యాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అనంతరం 1.45 గంటలకు విమానంలో తిరుగు ప్రయాణమై 2.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
భారీగా జనసమీకరణకు ఏర్పాటు
చాలా కాలం తరువాత జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సాగుతున్న తరుణంలో పెద్దఎత్తున ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంచ చేపడుతోంది. సుమారు పది వేల మంది వరకు విద్యార్థులను ఈ కార్యక్రమానికి హాజరు పరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితోపాటు మరో 20 వేల మందిని సభకు సాధారణ జనాన్ని తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం 250 ఆర్టీసీ బస్సులను ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. వేసవి కాలం కావడంతో జనాలు ఇబ్బంది కలుగకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం వైద్యులను సైతం ప్రత్యేకంగా నియమించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నార్పల : ఈ నెల 26వ తేదీన నార్పలో చేపట్టనున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ ఎమ్.గౌతమి ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకూ నడుచుకుంటూ వెళ్లి ప్రతి అంగుళం తనిఖీ చేశారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం సీఎం కాన్వారు ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సభకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపు సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ప్రజలంతా సహకరించి సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఆర్‌ఎన్.అమ్మిరెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, ఆర్డీవోలు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, జె.రవీంద్ర, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్ రావు పాల్గొన్నారు.










